ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో ఓ లేఖను రిలీజ్ చేశారు. ఈ మధ్య కాలంలో తన పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. దయచేసి ఏ పార్టీ వారైనా.. తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తన పేరును రాజకీయాలకు వాడుకోవద్దని పార్టీలకు సూచిస్తూనే.. అలాంటి పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు.ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్న మోహన్ బాబు.. అది వారి వారి వ్యక్తిగతమని లేఖలో పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టిపెట్టాలన్నారు.
ఆ లేఖలో ఏముందంటే..
ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించు కుంటున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వారి వ్యక్తిగతం, చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ఉన్నానని తెలిపారు.