విషాదం.. మిర్జాపూర్ నటుడు షానవాజ్ ప్రధాన్ గుండెపోటుతో క‌న్నుమూత‌

Mirzapur actor Shahnawaz Pradhan passes away at 56.మిర్జాపూర్ నటుడు షానవాజ్ ప్రధాన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2023 10:36 AM IST
విషాదం.. మిర్జాపూర్ నటుడు షానవాజ్ ప్రధాన్ గుండెపోటుతో క‌న్నుమూత‌

మిర్జాపూర్ నటుడు షానవాజ్ ప్రధాన్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శుక్ర‌వారం ముంబైలోని ఓ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న ప్ర‌ధాన్‌.. ఛాతీలో నొప్పి అంటూ కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే ఆయ‌న్ను కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్ప‌టికే అత‌డు చ‌నిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ఆయ‌న వ‌య‌స్సు 56 సంవ‌త్స‌రాలు.

ఫాంటమ్, రాయస్, మీర్జాపూర్, తోట వెడ్స్ మైనా మరియు అనేక ఇతర చిత్రాలలో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు షానవాజ్ ప్రధాన్.

యాదృచ్ఛికంగా.. టీవీ నటి సురభి తివారీ తన సోదరుడి చికిత్స కోసం అదే ఆసుపత్రిలో ఉన్నారు. షానవాజ్‌ను స్ట్రెచర్‌పై గదిలోకి తీసుకెళ్లడం తాను చూశానని ఆమె చెప్పింది. అతడిని కూడా నా సోదరుడి పక్కనే ఉంచారు. షానవాజ్‌లో పల్స్ కనిపించడం లేదని వైద్యులు చెప్పారు. అత‌ని గుండె ఎలాంటి చికిత్సకు స్పందించ‌డం లేద‌ని వైద్యులు చెప్ప‌డం విన్నాన‌ని తెలిపింది. కాగా.. రెండు నెలల క్రితం షానవాజ్‌కి బైపాస్ సర్జరీ జరిగిందని సురభికి చెప్పింది.

షానవాజ్ ప్రధాన్ హాజ‌రైన‌ కార్యక్రమంలో పాల్గొన్న‌ లగాన్ నటుడు యశ్‌పాల్ శర్మ సోషల్ మీడియాలో ఈ విష‌యాన్ని దృవీక‌రించారు. "ముంబైలో జరిగిన అవార్డుల ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు అయ్యాను. వంద‌లాది మంది ఆర్టిస్టుల‌తో ప్రాంగ‌ణం అందంగా ఉంది. అయితే.. అవార్డు అందుకున్న కొద్దిసేప‌టికి మా ప్రియమైన కళాకారుడు షానవాజ్ అక‌స్మాత్తుగా కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే కార్య‌క్ర‌మాన్ని నిలిపివేసి ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్లాం. అయిన‌ప్ప‌టికీ అత‌డిని ర‌క్షించ‌లేక‌పోయాం. అంద‌రి క‌ళ్ల ముందే ఆయ‌న ప్రాణాలు వ‌దిలారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను కుటుంబానికి ధైర్యాన్ని అందించండి." అని సోష‌ల్ మీడియాలో బావోద్వేగ‌పు పోస్ట్ పెట్టారు.

Next Story