నంది అవార్డుల తరహాలో సినీ రంగానికి గద్దర్ అవార్డులు ఇస్తామని తాము చేసిన ప్రతిపాదన పట్ల చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ దిగ్గజ రచయిత, జ్ఞాన్‌పీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి 'విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం' ప్రదానం చేశారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం.. కానీ సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరమని ఆయన అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీద సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రతి ఏటా గద్దర్ అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత... ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి బాధ్యత తీసుకోవాలని చిరంజీవి ట్వీట్ చేశారు.