నాగబాబు మళ్లీ సీరియస్ అయ్యారు
By Medi Samrat Published on 27 March 2023 4:01 PM ISTరామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడారు. అయితే కొందరు ఫ్యాన్స్ ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ఆయన వేదికపై మాట్లాడుతుండగా ఆ వాయిస్ ఆయనకు వినిపించింది. దీంతో ‘‘మాట్లాడతాను.. కాస్త ఆగండి. కళ్యాణ్ బాబు గురించి కొద్దిసేపటి తర్వాత మాట్లాడదామని అనుకున్నా. ఇలా అల్లరి చేస్తే అసలు కంటెంట్ పోతుంది. కొంచెం సేపు సైలెంట్ గా ఉండండి’’ అని కోరారు. కానీ పదేపదే ‘పవర్ స్టార్ సీఎం.. పవర్ స్టార్ సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. తనను తాను నియంత్రించుకుంటూ.. ‘‘మనం ఇవాళ వచ్చింది చరణ్ బర్త్ డే వేడుకలకు కాబట్టి.. మొదట గౌరవం చరణ్ కు ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని చెప్పారు. కొద్దిసేపు నిశబ్దంగా ఉన్న నాగబాబు తర్వాత మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు కదా.. సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎంను చేయాలి అని అన్నారు కదా. కాబట్టి సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు.. మీకు దమ్ముంటే ఎలక్షన్ లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కళ్యాణ్ కు మనం ఇచ్చే గొప్ప బహుమతి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.