'మా' ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తైంది. అధ్యక్ష పీఠం కోసం తలపడ్డ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, యువ హీరో మంచు విష్ణు విజయం సాధించారు. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. మొదటగా ఈసీ మెంబర్స్ ఓట్లను లెక్కించగా.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ సభ్యులు మొదట వరుసగా విజయాలు సాధించారు. శివారెడ్డి, అనసూయ, కౌశిక్, సురేశ్ కొండేటి గెలుపొందారు. తరువాత మంచు విష్ణు ప్యానల్‌లో ఎనిమిది మంది విజయం సాధించారు. మాణిక్ , హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత కార్యవర్గసభ్యులుగా గెలుపొందారు.
'మా' జనరల్ సెక్రటరీ ఎన్నికలో రఘుబాబు విజయం సాధించారు. జీవిత రాజశేఖర్‌పై ఏడు ఓట్ల తేడాతో రఘుబాబు గెలుపొందారు. విష్ణు ప్యానల్ తరఫు నుంచి కోశాధికారిగా బరిలో నిలిచిన శివ బాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని నాగినీడుపై శివబాలాజీ గెలుపొందారు. ఇక 'మా' కొత్త ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి బరిలో దిగిన శ్రీకాంత్.. మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన బాబూమోహన్‌పై జయకేతనం ఎగురవేశారు.