మలయాళ గాయకుడు బషీర్ శనివారం నాడు(మే 28న) ప్రదర్శన ఇస్తూ ఉండగానే వేదికపై కుప్పకూలి మరణించాడు. కేరళలో ఆర్కెస్ట్రాను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో ఈదవ బషీర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. కేరళలోని అలప్పుజా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 ఏళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి మరణించారు.
1978లో విడుదలైన హిందీ చిత్రం టూటే ఖిలోనే సినిమాలోని ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాస్ 'మాన హో తుమ్ బేహద్ హసీన్...' పాటను పాడుతూ ఉండగా బషీర్ కుప్పకూలిపోయారు. పాట పాడుతున్న సమయంలో వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆయన చేతిలో నుండి మైక్ పడిపోయింది. దగ్గరలో ఉన్న వ్యక్తులు వేదికపైకి వెళ్లడం ప్రారంభించారు. ఆయనకు ఏమైనా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఆయన కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు. బషీర్‌ను ఆసుపత్రికి తరలించగా, ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. బషీర్ మరణంపై పలువురు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు.