లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మలయాళ చిత్ర దర్శకుడు రంజిత్‌కు ఎర్నాకుళంలోని మేజిస్ట్రేట్ కోర్టు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తనతో పాటు పనిచేసిన ఓ నటిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో అతన్ని మార్చి 31న పోలీసులు అరెస్టు చేశారు. రంజిత్ తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, ఎర్నాకుళం జిల్లా విడిచి వెళ్లకూడదని కోర్టు సూచించింది. లక్ష రూపాయల పూచీకత్తుతో పాటు, అదే మొత్తానికి ఇద్దరు జామీనుదారులను సమర్పించాలని తెలిపింది. వచ్చే మూడు నెలల పాటు లేదా ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
తనను రంజిత్ సినిమా షూటింగ్ సమయంలో క్యారవాన్‌లోకి పిలిచి లైంగిక దాడికి యత్నించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా మార్చి 28న ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది. దీనిపై కొచ్చి సిటీ పోలీస్ కమీషనర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని రంజిత్ మీడియాతో చెప్పారు.