2018 సినిమాకు అరుదైన గౌరవం

‘ఆస్కార్‌ 2024’ అవార్డుల కోసం భారత్‌ నుంచి ‘2018’ సినిమా అధికారికంగా ఎంపికైంది.

By Medi Samrat  Published on  27 Sept 2023 3:45 PM IST
2018 సినిమాకు అరుదైన గౌరవం

‘ఆస్కార్‌ 2024’ అవార్డుల కోసం భారత్‌ నుంచి ‘2018’ సినిమా అధికారికంగా ఎంపికైంది. టొవినో థామస్ నటించిన ఈ సినిమాకు జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. 2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా రూపొందించారు ఈ సినిమాను. ఈ సినిమా మలయాళంతో పాటు, ఇతర భాషలలోనూ మంచి స్పందన తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద రూ.100కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

‘ఆస్కార్‌ 2024’ అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీ పడ్డాయి. ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న ఈ సినిమాలను వీక్షించింది. మొత్తం 22 చిత్రాలను కమిటీ వీక్షించి, చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరి కోసం ‘2018’ సినిమాను ఎంపిక చేసింది. ఆమిర్‌ఖాన్‌ ‘లాగాన్‌’ తర్వాత ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రమూ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో తుది వరకూ నిలవలేదు.

టోవినో థామస్ మాట్లాడుతూ.. “ఆస్కార్‌కు భారతదేశం అధికారిక ఎంట్రీగా 2018 సినిమా ఎంపిక కావడం నిజంగా మా చిత్రానికి అద్భుతమైన గుర్తింపు. నటుడిగా ఇది నాకు గర్వకారణం మాత్రమే కాదు, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన మొత్తం టీమ్‌కు ఇది గర్వకారణం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కేరళ ప్రజల దృఢత్వం, స్ఫూర్తికి ఈ సినిమా ప్రతిబింబం." అని చెప్పుకొచ్చాడు.

Next Story