శోకసంద్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ.. కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
Legendary filmmaker K Viswanath passes away.టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్
టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆణిముత్యాలైన చిత్రాల్లో ఒకటైన 'శంకరాభరణం' విడుదలైన (2 ఫిబ్రవరి) రోజునే ఆయన శివైక్యం చెందారు. కళాతపస్వి ఈ లోకం విడిచి వెళ్లడడంతో టాలీవుడ్ మొత్తం దుఖఃసాగరంలో మునిగిపోయింది.
కె.విశ్వనాథ్ పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామంలో జన్మించారు. గుంటూరులోని హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తిచేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పని చేసే వారు. డిగ్రీ పూర్తికాగానే విశ్వనాథ్ తండ్రి పనిచేసే స్టూడియోలోనే సౌండ్ రికార్డిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.
'పాతాళభైరవి' చిత్రానికి అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పని చేశారు. 1965లో 'ఆత్మగౌరవం' చిత్రంతో దర్శకుడిగా తొలి చిత్రాన్ని తీశారు. ఈ చిత్రానికి నంది అవార్డును అందుకున్నారు. ఆ తరువాత 'సిరిసిరిమువ్వ', 'శంకరాభరణం', 'సాగరసంగమం', 'స్వర్ణకమలం', 'శ్రుతిలయలు', 'సిరివెన్నెల', 'ఆపద్భాంధవుడు' వంటి ఎన్నో ఆణిముత్యాల చిత్రాలను తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో 41, హిందీలో 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అదే సంవత్సరం పద్మ శ్రీ పురస్కారాలను అందుకున్నారు. 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన్ను వరించింది. తెలుగు సినిమాను ఆస్కార్ అంచుల దాకా తీసుకువెళ్లిన ఘనకీర్తి ఆయన సొంతం. ఆయన తెరకెక్కించిన 'స్వాతిముత్యం' చిత్రం ఆస్కార్(59వ) చిత్రాల బరిలో నిలిచింది. ఆసియా ఫిసిఫిక్ చలన చిత్ర వేడుకల్లో 'స్వాతిముత్యం', 'సాగర సంగమం',' సిరివెన్నెల' చిత్రాలు ప్రదర్శితమయ్యాయి.