సూసైడ్ అటెంప్ట్ కాదు..నిద్రపట్టలేదనే అలా చేశా: పోలీసులకు కల్పన స్టేట్‌మెంట్
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు.
By Knakam Karthik Published on 5 March 2025 4:34 PM IST
సూసైడ్ అటెంప్ట్ కాదు..నిద్రపట్టలేదనే అలా చేశా: పోలీసులకు కల్పన స్టేట్‌మెంట్
సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీసులు వివరణ ఇచ్చారు. సింగర్ కల్పన తన కుటుంబంతో కేరళ ఎర్నాకుళం జిల్లాలో నివాసం ఉంటున్నారు. గత ఐదు సంవత్సరాలుగా సింగర్ కల్పన హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో ఉంటున్నారు. మార్చి 3వ తేదీన తన కుమార్తె దయ ప్రసాద్‌కి మధ్య చదువు విషయంలో మనస్పర్థలు వచ్చాయి. కుమార్తెను హైదరాబాద్‌లో చదువుకోవాలని కల్పన కోరగా..దయప్రసాద్ నిరాకరించింది. కాగా ఈ నెల 4వ తేదీన ఎర్నాకుళం నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసానికి కల్పన వచ్చారు. అనంతరం పడుకున్నట్లు చెప్పారు. అయితే ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవడంతో 8 జోల్ ఫ్రెష్ నిద్ర మాత్రలు వేసుకున్నట్లు కల్పన చెప్పారు..అని కేపీహెచ్‌బీ పోలీసులు పేర్కొన్నారు.
అయితే నిద్ర పట్టకపోవడంతోనే తర్వాత మరో 10 మాత్రలు వేసుకోవడంతో అపసార్మక స్థితిలోకి వెళ్లిపోయానని కల్పన చెప్పినట్లు.. పోలీసులు వెల్లడించారు. తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని కల్పన చెప్పారని పోలీసులు అన్నారు. కాగా కల్పన భర్త ప్రసాద్.. ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన సమాధానం చేయలేదు. దీంతో ఈ విషయం కాలనీ వెల్ఫేర్ సభ్యులకు చెప్పడంతో.. వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ సహాయంతో కిచెన్ డోర్ ద్వారా లోపలికి ప్రవేశించి, బెడ్ రూమ్‌లో అపస్మారకస్థితిలో ఉన్న కల్పనను దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించాం..అని పోలీసులు చెప్పారు. అయితే తాను ఎలాంటి ఆత్మహత్యాయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవ్వరి ప్రమేయం లేదని కల్పన చెప్పారు. తనకు, తన కూతురి మధ్య జరిగిన విషయంలో నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడం కారణంగానే ఇలా జరిగిందని కల్పన పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.