ఖిలాడీ టీజర్.. మాస్ మహారాజ్ థ్రిల్ చేయబోతున్నట్లే..!
Khiladi Movie Teaser. మాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన ఖిలాడీ సినిమా టీజర్ విడుదలైంది.
By Medi Samrat Published on 12 April 2021 10:46 AM ISTమాస్ మహారాజ రవి తేజ హీరోగా నటించిన క్రాక్ ఈ ఏడాది మంచి హిట్ గా నిలిచింది. కరోనా లాక్ డౌన్ తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాగా క్రాక్ నిలిచింది. ఈ సినిమా తర్వాత రవితేజ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ సినిమా టీజర్ విడుదలైంది. రవితేజ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంది. గతంలో వీర సినిమా ద్వారా ప్లాప్ ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మకు మరోసారి అవకాశం ఇచ్చాడు రవితేజ.
రవితేజ రెండు పాత్రలలో కనిపించి ఆకట్టుకున్నాడు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వెళ్ళింది. రవితేజ ఇందులో హీరోనా.. విలనా.. అనే సస్పెన్స్ ను రెండు పాత్రల ద్వారా టీజర్ మొత్తం మెయింటైన్ చేశారు. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తుండగా, అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది. మే 28న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి హిట్ అందుకున్నాడు. థ్రిల్లర్ లను పెద్ద హీరోలు చేయడం చాలా అరుదు కావడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉండనున్నాయి.