మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి నాలుగు గంటల పాటు విచారణ చేసిన తర్వాత మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను శనివారం కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల దాడిలో చాకో కొచ్చిలోని ఒక హోటల్ నుండి పారిపోయిన కొన్ని రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది. 41 ఏళ్ల చాకోపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. కేరళలోని ఎర్నాకుళం నార్త్ పోలీసులు ఎన్‌డీపీఎస్ చట్టం కింద నటుడి అరెస్టును అధికారికంగా నమోదు చేశారు. చాకోపై మోపిన అభియోగాలు బెయిలబుల్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొచ్చి నగర పోలీసులు సమన్లు జారీ చేసిన తర్వాత చాకో విచారణకు హాజరయ్యాడు.
కొద్దిరోజుల కిందట పోలీసులు వచ్చారని గ్రహించిన చాకో తన హోటల్ గది మూడో అంతస్తు కిటికీ నుంచి రెండో అంతస్తు టెర్రస్ పైకి దూకినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణ సమయంలో తలుపు వద్ద పోలీసు అధికారులు ఉన్నారని తాను గ్రహించలేదని, తనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దుండగులు అని భావించానని, దీంతో తాను తప్పించుకున్నానని చాకో చెప్పాడు.