'కేరళ స్టోరీ 2' చూసేద్దామనుకుంటే.. షాకిచ్చిన కోర్టు..!
'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది.
By - Medi Samrat |
'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సినిమా ట్రైలర్ కేరళ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉందని, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని శ్రీదేవ్ నంబూద్రి అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలను కూడా కలుపుతూ, 'ది కేరళ స్టోరీ' అని పేరు పెట్టడం వల్ల కేరళ పరువు పోతోందని పిటిషనర్ వాదించారు.
2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తెలిపింది. సినిమాను వీక్షించిన హైకోర్టు సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. అసలు ఈ సినిమాకు 'U/A' సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారంటూ సెన్సార్ బోర్డు (CBFC) పై న్యాయస్థానం తీవ్ర స్థాయిలో మండిపడింది. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు బోర్డు నిబంధనలను పట్టించుకోలేదని జస్టిస్ బెచు కురియన్ థామస్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యానించింది.