కంగన ట్విటర్ ఖాతా సస్పెండ్ చేయడం కుదరదు
Kangana Ranaut's Twitter account. కంగనా రనౌత్.. ఏదీ మనసులో దాచుకోదు.. ఎవరిని టార్గెట్ చేయాలో వారిని
By Medi Samrat Published on 22 Dec 2020 6:38 PM IST
కంగనా రనౌత్.. ఏదీ మనసులో దాచుకోదు.. ఎవరిని టార్గెట్ చేయాలో వారిని టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదమవుతూ ఉంటాయి. ట్విట్టర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలను కంగన చేస్తోందని, తమ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందని అలీ ఖాసిఫ్ ఖాన్ అనే వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కంగనకు ఊరటను కల్పించింది.
కంగన ట్విటర్ ఖాతా సస్పెండ్ చేయడం కుదరదని ముంబై హై కోర్టు వ్యాఖ్యానించింది. కంగన రనౌత్ ట్విటర్ వేదికగా జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, మతపరమైన నమ్మకాలను దెబ్బతీశారని న్యాయవాది అలీ ఖాసిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఓ క్రిమినల్ పిటీషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు కంగనను మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ట్విటర్‌లో ప్రతి ఒక్కరికీ ఖాతా ఉంటుందని, అందులో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు కూడా వారికి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు చాలా తేడా ఉందని పేర్కొంది. కంగన వ్యాఖ్యలను జాతి వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించలేమని తేల్చి చెప్పింది. కేసులో తీర్పును జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.