ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు కన్నుమూశారు. 88 ఏళ్ల ఆయన వయసు రీత్యా తీవ్ర అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నానక్ గూడలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు.
రామోజీ రావు నిర్మాతగా పలువురిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయన పరిచయం చేసిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగారు. రామోజీరావు మరణ వార్త తెలిసిన వెంటనే ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. "శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అంటూ ట్వీట్ వేశారు.