టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ ఫ్రా కేసులో భాగంగా, అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో, జగపతిబాబు గతంలో సాహితీ ఇన్ ఫ్రా సంస్థ యాడ్స్ లో నటించడం అంశంపై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఆ సంస్థ ప్రకటనల్లో నటించినందుకు గాను ఆయనకు అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై వివరాలు సేకరించారు.
ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షించిన సాహితీ ఇన్ ఫ్రా, సుమారు 700 మంది నుంచి రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసి మోసానికి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులను షెల్ కంపెనీలకు మళ్లించి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఆ సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.161 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది.