జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు కోర్టులో భారీ ఊరట

బాలీవుడ్‌ నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఒకప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌ తో ప్రేమాయణం నడిపింది

By Medi Samrat  Published on  16 Aug 2023 7:43 PM IST
జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు కోర్టులో భారీ ఊరట

బాలీవుడ్‌ నటి జాక్విలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఒకప్పుడు సుఖేష్ చంద్రశేఖర్‌ తో ప్రేమాయణం నడిపింది. ఇది ఆమె జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. అతడు ఎంత పెద్ద మోసగాడో ఆ తర్వాత తెలిసింది. దీంతో సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ఆమె విదేశాలకు వెళ్ళాలన్నా ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీంతో కోర్టు అనుమతితోనే ఆమె గతంలో పలు దేశాలకు వెళ్ళింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో గతంలో బెయిల్‌ ఇచ్చింది.

ఇప్పుడు ఆమెకు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. 2022 నవంబర్‌లో ఆమె విదేశాలకు వెళ్లేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సవరించింది. అదనపు సెషన్స్ జడ్జి (ASJ) శైలేందర్ మాలిక్ వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును సవరించాలని కోరుతూ దరఖాస్తును అనుమతించారు. విదేశాలకు ప్రయాణం అవ్వడానికి మూడు రోజుల ముందు కోర్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలియజేయాలని సూచించింది. జాక్వెలిన్‌ బెయిల్ స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, బెయిల్ ఆర్డర్‌లోని ఎటువంటి షరతులను ఉల్లంఘించలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. జాక్వెలిన్‌ విదేశాలకు వెళ్లడానికి సంబంధించిన సమాచారంలో తాను వెళ్లే దేశం, వివరాలు, కాంటాక్ట్ నంబర్ మొదలైన ఇతర వివరాలను తెలియజేయాలని కోర్టు సూచించింది.

Next Story