ఆ జబర్దస్త్ హరి నేను కాదు బాబోయ్
Jabardasth Comedian Hari. చిత్తూరు జిల్లా పుంగనూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
By Medi Samrat Published on 13 Jun 2023 8:06 PM ISTచిత్తూరు జిల్లా పుంగనూరు శివారు ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పోలీసులను చూసి రెండు వాహనాలు వేరే రూట్ లో వెళ్ళడానికి ప్రయత్నించాయి. పోలీసులు వాటిని ఛేజ్ చేశారు. ఈ క్రమంలో ఒక వాహనం డ్రైవర్ తప్పించుకుని పారిపోగా మరో వాహనం డ్రైవర్ కిశోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో ఉన్న రూ.60 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కిశోర్ ను పోలీసులు విచారించగా పలు కీలక విషయాలు బయటపెట్టాడు. ఎర్రచందనం దుంగలను భాకరాపేట అటవీప్రాంతం నుంచి అక్రమంగా సేకరించి, బెంగళూరు సమీపంలోని కటిగనహళ్లి గ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో జబర్దస్త్ కమెడియన్ హరి ప్రధాన సూత్రధారి అని చెప్పాడు. కిశోర్ చెప్పిన వివరాల ఆధారంగా హరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే ‘జబర్దస్త్’ షోలో ఉన్న హరిత అలియాస్ హరికృష్ణ అనుకొని వార్తలు వచ్చేశాయి. దీంతో హరికృష్ణ స్పందించారు. అసలు ఆ హరిని తాను కాదు అని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు షకలక శంకర్ టీమ్‌లో హరిబాబు పనిచేశాడని.. అతడి బదులు తనను నిందితుడిగా చూపిస్తున్నారని అన్నారు. మీడియాలో తనపై ఇలాంటి వార్తలు రావడం వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని.. తన ఫ్యామిలీ ఇబ్బంది పడుతోందని హరి అన్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు విషయంలో తనకు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని.. మూడోసారని హరి చెప్పారు. 2016లో ఒకసారి, లాక్‌డౌన్‌కు ముందు ఒకసారి తనపై ఇలాగే వార్తలు రాశారని అన్నారు. మళ్లీ ఇప్పుడు మూడోసారి కూడా అలాగే జరిగిందని అన్నారు.