పుష్ప 2 టికెట్ ధరల పెంపు.. హైకోర్టు రియాక్ష‌న్ ఇదే..!

పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో లకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

By Medi Samrat  Published on  3 Dec 2024 3:20 PM IST
పుష్ప 2 టికెట్ ధరల పెంపు.. హైకోర్టు రియాక్ష‌న్ ఇదే..!

పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో లకు భారీగా టికెట్ ధరలు పెంచారని, సామాన్యులు మూవీ చూసే పరిస్థితి లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ డేస్ లో రిలీజ్ రోజే సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయన్న న్యాయమూర్తి.. ఇప్పట్లో కుటుంబం మొత్తం సినిమా వీక్షించాలంటే 8 వేలు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి నిర్మాత త‌రుపు న్యాయ‌వాది స్పందిస్తూ బెనిఫిట్ షో కేవ‌లం హీరో అభిమాన సంఘాల‌కు మాత్ర‌మేన‌న్నారు. అందుకే రేట్లు పెంచిన‌ట్లు పేర్కొన్నారు.

పుష్ప 2 బెనిఫిట్ షో ద్వారా వచ్చే నగదు ఎక్కడికి మళ్లిస్తున్నారని పిటిషనర్ ప్రశ్నించారు. పెంచిన రేట్ల‌తో వ‌చ్చిన ఆదాయాన్ని పీఎం, సీఎం, ఛారిటీ స‌హాయ నిధి ఖాతాల్లోకి వెళ్ల‌డం లేద‌ని.. నిర్మాత‌లు మాత్ర‌మే ల‌బ్ధి పొందుతున్నార‌న్నారు. అయితే, పూర్తి నివేదిక పరిశీలించి ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది. జీవోలను సైతం పరిశీలిస్తామని పేర్కొంది. రాత్రి 10 గంటలకు, అర్థ‌రాత్రి ఒంటి గంట‌కు, తెల్ల‌వారుజామున నాలుగు గంట‌ల‌కు షోలు జనాల‌ను ఇబ్బంది పెడుతున్నార‌ని పిటీష‌న‌ర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 10 గంట‌ల‌కు షో వేస్తే మధ్య రాత్రి 1 అవుతుందని పిల్లలకు నిద్ర అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. కౌంట‌ర్ దాఖ‌లుకు నిర్మాత త‌ర‌పు న్యాయ‌వాది స‌మ‌యం అడ‌గ‌గా.. విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 17కు వాయిదా వేశారు న్యాయ‌మూర్తి. దీంతో పెరిగిన ధ‌ర‌లు అలాగే కొన‌సాగ‌నున్నాయి.

ఇదిలావుంటే.. డిసెంబ‌ర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోల‌తో పాటు అర్ధరాత్రి 1 షోల‌కు అనుమతినిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సింగిల్ థియేట‌ర్‌ల‌లో, మల్టీఫ్లెక్స్‌ల్లో ఈ బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. మ‌రోవైపు అర్థరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్స్‌ట్రా షోలకు అనుమతినిచ్చింది. డిసెంబ‌ర్ 05 నుంచి 08 వ‌ర‌కు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచింది. అలాగే.. డిసెంబ‌ర్ 09 నుంచి 16 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతిని ఇచ్చింది. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ థియేట‌ర్‌ల‌లో రూ.20 మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు 18 రోజులు ఈ పెంచిన రేట్లు అమ‌లులో ఉండ‌నున్నట్లు వెల్లడించింది.

Next Story