కేరళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం కుదుపులకు లోనవుతూ ఉంది. అక్కడ మహిళా ఆర్టిస్టులకు ఏ మాత్రం రక్షణ లేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మలయాళ చిత్రాల షూటింగ్ సెట్‌లలోని కారవాన్‌లలో రహస్య కెమెరాలతో మహిళా నటీనటుల అభ్యంతరకర వీడియోలు రికార్డు చేశారని.. మగ నటులు తమ మొబైల్ ఫోన్‌లలో దానిని వీక్షించడాన్ని తాను స్వయంగా చూశానని నటి రాధికా శరత్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ కె హేమ కమిటీ నివేదికను విడుదల చేసిన నేపథ్యంలో రాధికా శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హేమ కమిటీ నివేదిక ఆలస్యమవ్వడంపై కూడా రాధిక ఆశ్చర్యపోయారు. మలయాళ పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా మహిళలపై వేధింపులు, అసభ్యకరమైన ప్రవర్తింపులు కొనసాగుతున్నాయని రాధిక తెలిపారు. ఈ విషయంలో తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ.. రాధిక శరత్‌కుమార్ ఒక మలయాళ చిత్రం షూటింగ్ సెట్‌లో.. పురుషులు కారవాన్‌లలో రహస్య కెమెరాలను ఉపయోగించి క్యాప్చర్ చేసిన నటీమణుల క్లిప్‌లను చూస్తున్నట్లు చెప్పారు. దీనిపై అప్పట్లోనే తాను తీవ్రంగా స్పందించానని.. మళ్లీ వాహనాల్లో రహస్య కెమెరాలు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించానన్నారు.