'హరి హర వీర మల్లు' యాక్షన్ సీన్ లీక్
Hari Hara Veera Mallu leaked video goes viral.ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమకు లీకుల బెడద తప్పడం లేదు.
By తోట వంశీ కుమార్ Published on 29 Jun 2021 12:33 PM IST
ఇటీవల కాలంలో చిత్రపరిశ్రమకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి కూడా ఏదో ఒక రూపంలో షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీకవుతూనే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు నుంచి ఓ వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తుండగా.. జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ లు కథానాయికలు నటిస్తున్నారు. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
హరి హర వీరమల్లు సినిమా 16వ శతాబ్ధపు కథతో వస్తుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ బందిపోటు పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పవర్ స్టార్ ఇలాంటి పాత్రల్లో నటించడం ఇదే మొదటి సారి కావడంతో ఈ సినిమాపై అంచానాలు ఇప్పటికే ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక అభిమానులైతే వాళ్ల హీరోని సరికొత్తగా చూడబోతున్నామని సినిమా విడుదల తేది కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ వీడియో లీక్ పవన్ ఫ్యాన్స్‌కి జోష్‌నిచ్చిందనే చెప్పాలి. ఈ వీడియోలో.. మల్ల యోధులు సై అంటుంటే.. ఎదురుగా పవన్ నిలబడి ఉంటాడు. ఇక వారి చుట్టూ ఉన్న మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చన్నారు. చూస్తుంటే ఈ వీడియో సినిమాలో కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించిందిగా అనిపిస్తోంది.
గతంలోనూ 'వకీల్ సాబ్' చిత్రం మేకింగ్ సమయంలో ఓ ఫోటో ఇలానే బయటకు రాగా, అప్పట్లో అది వైరల్‌గా మారడమే గాక చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం.