షారూఖ్ ఖాన్ భార్యకు ఈడీ నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది.

By Medi Samrat  Published on  19 Dec 2023 6:50 PM IST
షారూఖ్ ఖాన్ భార్యకు ఈడీ నోటీసులు

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు పంపింది. షారూఖ్ భార్య గౌరీఖాన్ రూ.30 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లక్నోకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తులసియానీ గ్రూప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్నారు గౌరీఖాన్‌. పెట్టుబడిదారులు, బ్యాంకులకు సుమారు రూ.30 కోట్ల ఆర్థిక నష్టం కలిగించిందని తులసియానీ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే గౌరీఖాన్ పై కేసు నమోదైంది. తాజాగా ఈడీ ఆమెకు కూడా నోటీసులు పంపించింది. తులసియానీ గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి గౌరీ ఎంత డబ్బు తీసుకున్నారనే కోణంలోనూ ఈడీ అధికారులు విచారించనున్నారు.

ముంబైకి చెందిన కిరీట్ జస్వంత్ షా అనే వ్యక్తి 2015లో తులసియానీ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాజెక్టులోని ఫ్లాట్ ను రూ.85 లక్షలకు కొనుగోలు చేశాడు. ఈ కంపెనీ షా నుంచి డబ్బులు తీసుకున్నాక ఫ్లాట్ ఇవ్వలేదు. డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. చివరకు తులసియానీ గ్రూప్ డైరెక్టర్లు అనిల్ కుమార్ తులసియానీ, మహేష్ తులసియానీ, బ్రాండ్ అంబాసిడర్ ఉన్న గౌరీఖాన్ పైనా కిరీట్ జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. 2023, మార్చిలో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ హోదా కోసం గౌరీ ఖాన్ చేసుకున్న ఒప్పందాలు, అందుకు సంబంధించిన వివరాలను తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈడీ నోటీసులపై గౌరీఖాన్ టీమ్ స్పందించాల్సి ఉంది.

Next Story