గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది.

By Knakam Karthik
Published on : 22 April 2025 1:57 PM IST

Telangana, Gaddar Telangana Film Awards, Dil Raju, Jayasudha, Tollywood,

గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్

గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరపాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు. మంగళవారం LV ప్రసాద్ సినీ ల్యాబ్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల జ్యూరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ విధంగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా గద్దర్ సినిమా అవార్డుల కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. హైదరాబాదులో నిర్వహించబోయే గద్దర్ చలనచిత్ర అవార్డుల ఫంక్షన్ గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ సభ్యులు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

కాగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ వేడుకను జూన్ 14వ తేదీన హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన అవార్డుల కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సినీ రంగ నిపుణులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేసినట్టు దిల్ రాజు వివరించారు. నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరినట్టు ఆయన తెలిపారు. ఈ అవార్డుల జ్యూరీకి ప్రముఖ సీనియర్ నటి జయసుధ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

14 ఏళ్ల తర్వాత సర్కార్ ఇస్తున్న ఈ అవార్డుల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటైంది. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా వ్యక్తిగత 1172, ఫీచర్ ఫిల్మ్‌, చిల్డ్రన్‌ ఫిల్మ్స్‌, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు, తదితర కేటగిరీల్లో 76 దరఖాస్తులు వచ్చినట్లు ఇటీవల తెలిపారు. అవార్డుల కోసం దరఖాస్తు చేసిన నామినేషన్లను ప్రస్తుతం జ్యూరీ సభ్యులు పరిశీలిస్తున్నారు.

Next Story