కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 14.2 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న కన్నడ నటి రన్యా రావును అరెస్టు చేసిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు జరిపింది. లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల సమయంలో మూడు పెద్ద పెట్టెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆమె దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం విలువ రూ.17.29 కోట్లకు చేరుకుంది. ఇటీవలి కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారు అక్రమ రవాణా కేసుల్లో ఒకటిగా నిలిచిందని DRI తెలిపింది.
33 ఏళ్ల రన్యా తరచుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం వల్ల DRI నిఘాలోకి వచ్చింది. ఆమె 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కు వెళ్లిందని అధికారులు కనుగొన్నారు. దీంతో ఆమె స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుమానాలను లేవనెత్తింది. దీని ఆధారంగా ఆమె మార్చి 3న ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుండి బెంగళూరుకు వచ్చినప్పుడు ఆమెను అడ్డుకున్నారు.