హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారిణి అంజన సిన్హా ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే, మావోయిస్టుల నేపథ్యంతో ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందించిన 'దహనం' వెబ్ సిరీస్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా పేరును ఆమె అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అంజనా సిన్హా నేరుగా పోలీసులను ఆశ్రయించారు. తన ప్రమేయం లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా వెబ్ సిరీస్‌లో తన పేరును ప్రస్తావించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలను తానే చెప్పినట్లుగా వర్మ చిత్రీకరించారని చెప్పడం కూడా పూర్తిగా అవాస్తవమని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, తన పేరును దుర్వినియోగం చేసినందుకు రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
అయితే మాజీ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు, రామ్ గోపాల్ వర్మపై ఐదు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన సినిమాలు, కామెంట్స్‌తో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆర్జీవీ..లేటెస్ట్‌గా 'దహనం' వెబ్ సిరీస్‌తో మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.