విన్నర్ వాగ్దేవినే..!
First Telugu Indian Idol title winner Vagdevi's winning moments. తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ లో అట్టహాసంగా సాగిన ‘తెలుగు ఇండియన్ ఐడల్
By Medi Samrat
తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' లో అట్టహాసంగా సాగిన 'తెలుగు ఇండియన్ ఐడల్' తొలి సీజన్లో విన్నర్ గా బీవీకే వాగ్దేవి నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆమెను విజేతగా ప్రకటించారు. ఫైనల్ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకుంది. వీటితో పాటు గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మాణంలో రాబోయే ఓ సినిమాలో పాట పాడే అవకాశం కూడా ఆమెను వరించింది.
శ్రీనివాస్ మొదటి రన్నరప్ గా నిలవగా.. వైష్ణవి రెండో రన్నరప్ గా నిలిచింది. చిరంజీవి చేతులు మీదుగా శ్రీనివాస్ రూ. 3 లక్షల నగదు, వైష్ణవి రూ. 2 లక్షల నగదు అందుకున్నారు. చిరంజీవి తన 'గాడ్‌ఫాదర్'లో వైష్ణవికి పాట పడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో ప్రముఖ సింగర్ కార్తీక్ తాను సంగీతం అందించే తదుపరి చిత్రంలో వాగ్దేవికి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు.
వాగ్దేవి, వైష్ణవి, శ్రీనివాస్ తో పాటు ప్రణతి, జయంత్ ఫైనల్ కు చేరుకున్నారు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్ కు చిరంజీవితో పాటు తమ కొత్త సినిమా 'విరాట పర్వం' ప్రమోషన్స్ లో భాగంగా దగ్గుబాటి రానా, సాయిపల్లవి కూడా హాజరై సందడి చేశారు. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యా మీనన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా, ప్రముఖ గాయకుడు శ్రీ రామ్‌చంద్ర హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.