ప్రముఖ సింగర్ నివాస భవనంలో చెలరేగిన మంటలు
ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు షాన్ నివాస భవనంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.
By Medi Samrat
ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ గాయకుడు షాన్ నివాస భవనంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఫార్చ్యూన్ ఎన్‌క్లేవ్‌లోని ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. వార్తా సంస్థ ANI ప్రకారం.. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే అనేక అగ్నిమాపక దళ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. ప్రమాద తీవ్రతపై ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. షాన్ ఈ భవనంలోని 11వ అంతస్తులో నివసిస్తున్నాడు. మంటలు సింగర్ ఫ్లోర్‌కు చేరుకునేలోపే ఆరిపోయాయి. ఈ ఘటన జరిగిన సమయంలో షాన్ తన ఇంట్లో ఉన్నాడా లేదా అనే సమాచారం కూడా ఇంకా తెలియరాలేదు.
షాన్ పూర్తి పేరు శంతను ముఖర్జీ. 1972 సెప్టెంబరు 30న మహారాష్ట్రలోని ముంబైలో బెంగాలీ కుటుంబంలో శంతను ముఖర్జీ జన్మించాడు. అతని తండ్రి దివంగత మానస్ ముఖర్జీ సంగీత దర్శకుడు, సోదరి సాగరిక కూడా గాయని. అతని తాత జహర్ ముఖర్జీ ప్రసిద్ధ గీత రచయిత. షాన్ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ పాడారు. నాని ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో ఏది ఏది, ప్రేమ ఖైదిలోని మైనా మైనా, కమల్ హసన్ దశాతారంలో హొహో సనమ్ హోహో సనమ్ హోహో, నాగార్జున మన్మధుడు సినిమాలో చెలియా చెలియా చేజారివెళ్లకే వంటి తెలుగు సూపర్ హిట్ పాటలకు గాత్రదానం చేశారు.