సంక్రాంతికి రిలీజై సందడి చేసిన దసరా బుల్లోడు.. నేటికి 50 ఏళ్లు
Dussehra Bullodu Completes 50 Years. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి దసరా బుల్లోడు సంక్రాంతికి రిలీజై సందడి చేసి నేటికి 50 ఏళ్లు పూర్తిచేసుకుంది .
By Medi Samrat Published on 13 Jan 2021 5:24 AM GMTధర్మపత్నితో తెరంగ్రేటం చేసిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. అయితే ఏయన్నార్ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలున్నా.. తొలి స్వర్ణోత్సవం చిత్రం మాత్రం దసరా బుల్లోడు. 1971 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం నేటితో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలు కొన్ని తెలుసుకుందాం.
దసరా బుల్లోడులో అక్కినేని సరసన వాణిశ్రీ కథానాయికగా నటించగా.. ప్రతిష్టాత్మక జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక అప్పటివరకూ నిర్మాతగానే ఉన్న జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్ అంతకుముందు అక్కినేనితో.. ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, అక్కాచెల్లెలు వంటి సినిమాలు నిర్మించారు. అక్కినేని ప్రోత్సాహంతోనే రాజేంద్రప్రసాద్ మెగా ఫోన్ పట్టుకుని దసరా బుల్లోడుని తెరకెక్కించారు.
1971 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం సంవత్సరం పాటు ప్రదర్శితమై సంచలన విజయం సాధించింది. ఇది ఏయన్నార్ కెరీర్‌లో తొలి స్వర్ణోత్సవం చిత్రం. రాజేంద్రప్రసాద్ తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నా.. అనుభవమున్న దర్శకుడి రీతిలో ఈ సినిమాను తెరకెక్కించారు. పూర్తిగా గ్రామీణ నేఫథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. వరసైన వాళ్ళను ఆటపట్టించే బావలు, మరదళ్ళు.. మావయ్యలను వేళాకోలం చేసే అల్లుళ్ళు వంటి సరదా పాత్రలను సినిమాలో చూపించి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించారు.
ఇక ఈ సినిమాలో అక్కినేని, వాణిశ్రీలతో పాటుగా ఎస్వీరంగారావు, గుమ్మడి, నాగభూషణం, అంజలీదేవి, చంద్రకళ, సూర్యకాంతం, పద్మనాభం, రావి కొండలరావు, రాధాకుమారి వంటి నటులు నటించారు. ఇక ఈ చిత్రానికి మనసు కవి ఆత్రేయ మాటలు-పాటలు రాశారు. కేవీ మహదేవన్ సంగీతం అందించగా.. పాటలు సూపర్ హిట్టయ్యాయి. ఇక 30 కేంద్రాలలో రిలీజైన ఈ సినిమా 29 కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. నాగేశ్వరరావు చిత్రాలలో మరిచిపోలేని చిత్రంగా నిలిచింది.