ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హీరో ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ రిలీజ్ డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. 'యానిమల్' బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'స్పిరిట్'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.