విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. దర్శకుడు కె.వాసు కన్నుమూత

Director K Vasu Passed Away. టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు.

By M.S.R  Published on  26 May 2023 7:58 PM IST
విషాదంలో సినీ ఇండ‌స్ట్రీ.. దర్శకుడు కె.వాసు కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సీనియర్ దర్శకుడు కె.వాసు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. కె.వాసు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలిచిత్రం ప్రాణం ఖరీదు చిత్రానికి కె.వాసు దర్శకత్వం వహించారు. అంతేకాకుండా అమెరికా అల్లుడు, శ్రీషిరిడీ సాయిబాబా మహత్యం, ఇంట్లో శ్రీమతి వీధిలోకుమారి, అల్లుళ్లొస్తున్నారు వంటి పలు హిట్ చిత్రాలకు కె.వాసు దర్శకుడిగా పనిచేశారు. అతి చిన్న వయసులోనే దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన వాసు.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.

అప్రెంటీస్‌గా అతడి కెరీర్ మొదలైంది. ఛాయాగ్రాహకులు ఎం.జి.సింగ్, ఎం.సి.శేఖర్‌ల వద్ద రెండేళ్ళు కెమెరా అసిస్టెంట్‌గా, ఎడిటర్ బి.గోపాలరావు వద్ద కూర్పు అసిస్టెంట్‌గా ఒక సంవత్సరం పనిచేశారు. ఆదర్శకుటుంబం, మనసు మాంగల్యం, పల్లెటూరి బావ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తరువాత ఆడపిల్లల తండ్రి సినిమాకు తొలిసారి 22యేళ్ల వయసులో దర్శకత్వం వహించి స్వంతంగా నిర్మించారు. 1982లో రత్నకుమారిని వివాహం చేసుకున్నారు. వీరికి అన్నపూర్ణ, దీప్తి అనే అమ్మాయిలు ఉన్నారు.


Next Story