ఆస్పత్రిపాలైన బాలీవుడ్ ప్రముఖ నటుడు.. వదంతులను నమ్మకండి
Dilip Kumar Hospitalised After Complaining Of Breathlessness. బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయన
By Medi Samrat Published on 6 Jun 2021 4:08 PM GMT
బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్ ఆసుపత్రి పాలయ్యారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్న దిలీప్ కుమార్‌ను ఆదివారం ఉదయం కుటుంబసభ్యులు ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు. దిలీప్ కుమార్ ప్రస్తుతం సీనియర్ డాక్టర్లు.. కార్డియాలజిస్ట్ నితిన్ గొఖలే, పుల్మనాలజిస్ట్ డాక్టర్ జలిల్ పార్‌కర్ పర్యవేక్షణలో ఉన్నారు. దిలీప్ కుమార్ ఇద్దరు తమ్ముళ్లు అస్లాం ఖాన్, ఎహ్సాన్ ఖాన్ కరోనా కారణంగా గతేడాది మరణించారు.
డాక్టర్ జలిల్ పార్కర్ మీడియాతో మాట్లాడుతూ.. దిలీప్ కుమార్ ను ఆక్సిజన్ సపోర్టు తో ఉంచామని తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆయన్ను ఐసీయూలో ఉంచలేదని తెలిపారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు-మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. వైద్యులు ఆయన్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మకండని దిలీప్ కుమార్ టీమ్ తెలిపింది. వాట్సాప్ లోని ఫార్వర్డ్ మెసేజీలను అసలు నమ్మొద్దని దిలీప్ కుమార్ కుటుంబ సభ్యులు కోరారు. అభిమానుల ప్రార్థనలతో ఆయన కోరుకుంటారని తెలిపారు.