దిల్ రాజుకు కరోనా పాజిటివ్.. టెన్షన్ పడుతున్న మెగా అభిమానులు
Dil Raju Tested For Covid19. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ నిర్మాతగా
By Medi Samrat Published on 13 April 2021 1:55 PM ISTటాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డారు. వకీల్ సాబ్ నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు కూడా కరోనా బారిన పడ్డారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనకు పాజిటివ్ రావడంతో అంతా కంగారు పడుతున్నారు. తనకు పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిన వెంటనే హోమ్ ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు దిల్ రాజు. తనను కొన్ని రోజులుగా కలిసిన వాళ్లంతా వెంటనే టెస్టులు చేయించుకోవాలని కోరాడు దిల్ రాజు. మెగాస్టార్ చిరంజీవి కూడా రెండు రోజుల కిందే వకీల్ సాబ్ సక్సెస్ సందర్భంగా దిల్ రాజు, శ్రీరామ్ వేణులను సత్కరించారు. దాంతో మెగా అభిమానుల్లో కంగారు మొదలైంది. ఇప్పటికే వకీల్ సాబ్ యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ సన్నిహితులకు కూడా కరోనా సోకడంతో ఆయన కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
వకీల్ సాబ్ చిత్రం త్వరలో ఓటీటీ వేదికల్లో రిలీజ్ అవుతోందంటూ ప్రచారం జరుగుతుండడం పట్ల చిత్రబృందం స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని.. వకీల్ సాబ్ చిత్రాన్ని థియేటర్లలోనే చూడాలని కోరుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏ ఓటీటీ వేదికపైనా వకీల్ సాబ్ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశంలేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. దిల్ రాజు కూడా ఓ వీడియోను విడుదల చేశారు. తెలుగు సినిమా, పెద్ద హీరో సినిమా ఏదైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో వస్తుందని.. వకీల్ సాబ్ కూడా 50 రోజుల తర్వాతే ఓటీటీలో విడుదల అవుతుందని చెప్పారు. వకీల్ సాబ్ చిత్రంపై ఇంత ప్రేమ చూపించి భారీ హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికి ధన్యవాదాలని.. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను థియేటర్‌లోనే చూడండని దిల్ రాజు చెప్పుకొచ్చారు.