దీపిక పదుకోన్ ఇంట్లో కరోనా కలకలం
Deepika Padukones Family test positive for COVID-19. బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ కుటుంబంలోని వారందరూ కరోనా బారిన పడ్డారు.
By Medi Samrat Published on 4 May 2021 6:45 PM IST
బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ కుటుంబంలోని వారందరూ కరోనా బారిన పడ్డారు. దీపికా పదుకోన్ ఇంట్లో అందరూ కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. ఆమె తండ్రి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకోన్, ఆమె తల్లి ఉజాలా, చెల్లెలు అనీషాలకు కరోనా సోకింది. 65 ఏళ్ల ప్రకాశ్ పదుకోన్ ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్‌లో కోలుకుంటున్నారు. పది రోజుల కిందట ఇంట్లో అందరికీ స్వల్ప లక్షణాలు కనిపించాయని, దీంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలిందని ప్రకాశ్ సన్నిహితుడు, ఆయన బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ చెప్పారు. వారం రోజులు ఇంట్లోనే ఉన్నా ప్రకాశ్‌కు జ్వరం తగ్గకపోవడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేసినట్లు తెలిపారు.
దీపికా తల్లి, చెల్లులు ఇంట్లోనే కోలుకుంటున్నారు. ప్రకాశ్ పదుకోన్ 1970, 80ల్లో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఓ వెలుగు వెలిగాడు. ఇండియా తరఫున ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలవడమే కాకుండా 1983లో వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ బ్రాంజ్ మెడల్ గెలిచారు. భరత్ తరఫున తొలిసారి ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ (1980లో) గెలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎంతో మందికి ఆయన ఓ ఐకాన్ అని చెప్పొచ్చు. ప్రకాష్ పదుకోన్ ఇంకో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
దీపిక పదుకోన్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉంది. ఆమె మెంటల్ హెల్త్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడుపుతూ ఉంది. దీపిక ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటిస్తూ ఉంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా దీపిక నటిస్తోంది.