బిగ్ బాస్ షోపై నిప్పులు చెరిగిన నారాయణ
CPI Narayana Fire On BiggBoss Show. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.
By Medi Samrat Published on 5 Sept 2022 7:44 PM ISTబిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా బిగ్ బాస్ షో పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. అందుకు సంబంధించి ఒక సెల్ఫీ వీడియోను ఆయన పోస్టు చేశారు. సిగ్గు, ఎగ్గు లేని జంతువులు ఏమైనా చేయగలవని నారాయణ విమర్శలు గుప్పించారు. వింత జంతువులు, భార్యాభర్తలు కానోళ్ళు, అన్న చెల్లెలు కానోళ్ళు, ముక్కు ముఖం తెలియని వ్యక్తులు.. అక్కినేని నాగార్జున కనుసన్నల్లో 100 రోజుల పాటు బూతుల స్వర్గంలో ఉండనున్నారని విమర్శలు గుప్పించారు.
అమూల్య కాలాన్ని వృథా చేసే BIG BOSS షో కారణంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తుంగలోకి తొక్కుతున్నారని విమర్శించారు. శక్తి యుక్తులు ఉన్న యువత.. సమాజం కోసం పని చేయాలన్న ఆయన వంద రోజుల అమూల్య కాలాన్ని వృథా చేయకండని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సిగ్గులేని ప్రేక్షకులు టీవీల ముందు విరగబడి చూస్తూ జాతీయ సంపదను వృథా చేస్తున్నారని.. ప్రేక్షకులే దీనిపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కాసులకు కక్కుర్తి పడే లజ్జారహితులున్నంత కాలం, ఈ పాపాలకు ఆదరణ ఉంటున్నంత కాలం, ద్రౌపది వస్త్రాపహరణం వర్ధిల్లుతూనే ఉంటుందని బాధాకరంగా దిగమింగుదామా అని నారాయణ చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ సమాజానికి ఒక దుష్ట శత్రువు అని అన్నారు. అక్కడ కొన్ని కోతులను ఆడించి.. మనల్ని చూసే విధంగా చేస్తున్నారని.. ఇదొక దరిద్రపు షో అని అన్నారు. సభ్య సమాజం తలదించుకోవాలని అన్నారు.