'వ్యూహం' సినిమా రిలీజ్ ఆపాలి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
By Medi Samrat Published on 20 Oct 2023 8:54 PM ISTఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. ఈ సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరారు. ఈ చిత్రంలో వైఎస్ జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఆరోపించారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు నట్టికుమార్. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి వాళ్లను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. ఈ అంశం తెలంగాణ ఓటర్లపై ప్రభావం చూపుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యూహం సినిమా విడుదల మంచిది కాదని అన్నారు.
వ్యూహం సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటిస్తుండగా...వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. వ్యూహం సినిమాను నవంబర్ 10న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా ట్రయిలర్ లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టే చాలా పాత్రలు, ఘటనలు వ్యూహం ట్రయిలర్ లో ఉన్నాయి.