ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. జిమ్ ట్రైనర్ ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రాజు శ్రీవాస్తవకు ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం డాక్టర్ నితీష్ న్యాయ్ నేతృత్వంలోని కార్డియాలజీ, ఎమర్జెన్సీ విభాగానికి చెందిన ఎయిమ్స్ బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
ఎయిమ్స్ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీవాస్తవ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. ఆయన ట్రైనర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. రాజు శ్రీవాస్తవకు రెండుసార్లు సీపీఆర్ ఇవ్వడం జరిగింది. ఆయన కోలుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారని తెలిపారు.
రాజు శ్రీవాస్తవ సోదరుడు ఆశిష్ శ్రీవాస్తవ ఈ వార్తలను ధృవీకరించారు. కాన్పూర్‌కు చెందిన రాజు శ్రీవాస్తవ.. ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డ్ చైర్మన్ గా కూడా ఉన్నారు. పలువురిని కలిసేందుకు ఢిల్లీలో ఉన్న ఆయన.. ఈ రోజు ఉదయం ఓ జిమ్‌కి వెళ్లాడు. అదే సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో చేర్చిన అనంతరం ఆయన తిరిగి నియంత్రణలోకి వచ్చారని తెలిపారు.
రాజు శ్రీవాస్తవ ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందారు. ఆయన బాంబే టు గోవా, ఆమ్దాని అత్తన్ని ఖర్చు రూపయ్య వంటి చిత్రాలలో నటించారు. బిగ్ బాస్ 3లో కూడా పాల్గొన్నారు.