చిరంజీవి మాకు దేవుడి లాంటి వారు : ఊర్వశి

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి మీను రౌతేలాకు సహాయం చేసినందుకు సినీ నటి ఊర్వశి రౌతేలా మెగా స్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు.

By Medi Samrat  Published on  13 Feb 2025 8:29 PM IST
చిరంజీవి మాకు దేవుడి లాంటి వారు : ఊర్వశి

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో తన తల్లి మీను రౌతేలాకు సహాయం చేసినందుకు సినీ నటి ఊర్వశి రౌతేలా మెగా స్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి తనకు, తన కుటుంబానికి దేవుడిలాంటి వారని అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించానని ఆమె అన్నారు. తనది చాలా చిన్న పరిచయ పాత్ర అని, అయితే కష్ట సమయాల్లో మెగాస్టార్ తనకు, తన కుటుంబానికి అండగా నిలిచారని ఊర్వశి తెలిపింది. అందుకే ఆయన్ను దేవుడిగా, మా శక్తికి లైట్‌హౌస్‌గా భావిస్తామని ఊర్వశి చెప్పుకొచ్చింది.

ఇటీవల, ఊర్వశి తల్లి మీను రౌతేలా ఎడమ కాలులో ఇంట్రా-ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆసుపత్రి పాలయ్యారు. ఆ సమయంలో ఊర్వశి చిరంజీవిని సంప్రదించి సహాయం కోరారు. చిరంజీవి స్పందించిన వెంటనే కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో వైద్యుల బృందంతో మాట్లాడి సరైన చికిత్స అందించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసిన తర్వాత, మీనూ రౌతేలా కోలుకున్నారు. తన తల్లికి విజయవంతంగా వైద్య చికిత్స అందించడంపై ఊర్వశి స్పందించింది. తన కుటుంబం చిరంజీవికి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటుందని తెలిపింది.

సర్జరీ అనంతరం చిరంజీవి నాతో మాట్లాడుతూ.. మీ అమ్మ బాగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉంటారు. ఆ సమయంలో ఆయన మాటలు మాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. మా కుటుంబానికి సహాయం అందించి నిజమైన హీరో అనిపించుకున్నారు. భూమిపై మానవత్వం ఉందని నిరూపించారాయన అంటూ కొనియాడింది ఊర్వశి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మాకు అండగా నిలిచారు. ఏదైనా అడగడానికి మొహమాట పడవద్దని చెప్పారని భావోద్వేగానికి గురైంది ఊర్వశి.

Next Story