బాలుకి పద్మ విభూషణ్.. ఆ విషయమే నన్ను బాధిస్తోంది: చిరు

Chiranjeevi Expressed Happiness Over the Announcement of Padmavibhushan To SP Balu. దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలుకి పద్మ విభూషణ్..ఆ విషయమే నన్ను బాధిస్తోంది అన్న చిరు

By Medi Samrat
Published on : 26 Jan 2021 2:29 PM IST

Chiranjeevi Expressed Happiness Over the Announcement of Padmavibhushan To SP Balu

దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు ప్రకటించే పద్మ అవార్డుల్లో భాగంగా ఈ సంవత్సరం స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్నీ పద్మవిభూషణ్ పురస్కారంతో గౌరవిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కరోనా కోరల్లో చిక్కుకుని బాల సుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలూకు పద్మవిభూషణ్ పురస్కారం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ రావడంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు. త‌న‌ ప్రియమైన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్‌ అవార్డు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయ‌న చెప్పారు. ఆ అవార్డుకు ఆయన అర్హుడని అన్నారు. బ్రాకెట్స్‌లో మ‌ర‌ణానంత‌రం వ‌చ్చిన ప‌ద్మ‌విభూష‌ణ్‌ అనే పదం ఉండడం మాత్రం త‌న‌ను చాలా బాధిస్తోంద‌ని తెలిపారు. ఆయన ప‌ద్మ‌విభూషణ్ అవార్డును వ్యక్తిగతంగా స్వీక‌రించి ఉంటారనే భావిస్తున్నానని అన్నారు. ఆడియో రూపంలో చిరంజీవి ప్ర‌జ‌ల‌కు గణతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా విస్తృతంగా ర‌క్త‌దానం చేయాల‌ని కోరారు.


కళలు, సామాజిక సేవ వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్ తదితర రంగాల్లో ప్రముఖులకు ఇచ్చే పద్మ అవార్డులను ఈసారి 119 మందికి ప్రకటించారు. వీరిలో 7 గురికి పద్మవిభూషణ్, 10మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. పురస్కార గ్రహీతల్లో 29 మంది మహిళలున్నారు. ఎన్నారై కోటాలో మరో 10 మందికి పురస్కారాలు ప్రకటించగా, 16 మందికి మరణానంతర పురస్కారాలు దక్కాయి. ఒక ట్రాన్స్ జెండర్ కు కూడా పద్మాపురస్కారం దక్కింది. తరుణ్ గొగోయ్, రాం విలాస్ పాశ్వాన్,గుజరాత్ బీజేపీనేత కేశూభాయ్ పటేల్, స్పీకర్ సుమిత్రా మహాజన్ లకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామస్వామి అన్నవరపు, నిడుమోలు సుమతి, తెలంగాణకు చెందిన కనకరాజు లకు పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.


Next Story