విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా ఫిబ్రవరి 14, 2025 న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరింది. ఇక తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది.
ఈ సినిమా విడుదలైన రోజు నుండే, ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలకు తెలుగు ప్రేక్షకుల నుండి డిమాండ్ వచ్చింది. మాడాక్ ఫిల్మ్స్ బృందాన్ని సోషల్ మీడియాలో వెంబడించారు. ఎట్టకేలకు విక్కీ కౌశల్ అద్భుతమైన నటనతో మెప్పించిన ఛావా తెలుగులో విడుదలవుతోంది. తెలుగు వెర్షన్ వచ్చే వారాంతంలో మార్చి 7న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ గీతా ఆర్ట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు సన్నాహకాలు చేస్తోంది.