'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ చుట్టూ మచ్చా.. మచ్చా.. అంటూ తిరుగుతూ ఫ్రెండ్ పాత్ర చేసి పాపులారిటీ దక్కించుకున్న నటుడు జగదీష్‌ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తున్న జగదీశ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఓ జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లు జగదీశ్‌పై ఆరోపణలున్నాయి. పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఒక మహిళ గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జగదీశ్ ఫొటోలు తీయడంతో మనస్థాపానికి గురైన మహిళ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న జగదీశ్‌ను పోలీసులు డిసెంబర్ 6న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.
మల్లేశం, జార్జిరెడ్డి, పలాస 1978 తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీశ్. 'పుష్ప' లాంటి పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకుని.. చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్న సమయంలో జగదీశ్ ఇలా రిమాండ్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.