హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని రోడ్ నంబర్ 7లో తాళం వేసి ఉన్న తన ఇంటిని బెల్లంకొండ సురేష్ కబ్జా చేశారంటూ శివ ప్రసాద్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు బెల్లంకొండ సురేష్‌తో పాటు మరో వ్యక్తిపై బీఎన్ఎస్ 329(4), 324(5), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శివ ప్రసాద్ కొంతకాలంగా తన ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు. అయితే మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్ తన అనుచరులతో కలిసి ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారని ఆయన ఆరోపించారు. ఇంట్లోని సామాగ్రి, గోడలు ధ్వంసం చేసి, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన శివ ప్రసాద్ ధ్వంసమైన వస్తువులు చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం తన సిబ్బందిని సురేష్ ఇంటికి పంపగా, వారిపై బెల్లంకొండ సురేష్ దుర్భాషలు వాడి దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.