బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలపై కేసు
బెట్టింగ్ యాప్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలపై కేసు
బెట్టింగ్ యాప్స్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్ కేసులో పోలీసులు 11మంది యూ ట్యూబర్లపై కేసు నమోదు చేయడమే కాకుండా వారందరికీ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా సైబరాబాద్ పోలీసులు బాలీవుడ్, టాలీ వుడ్ నటులపై కూడా కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడిన యువత తప్పుదోవ పడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి నష్టపోయి... చివరకు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగించారు. దీంతో యూట్యూబర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు వారందరిపై కేసులు నమోదు చేశారు.
తాజాగా మియాపూర్ ప్రగతి ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ పిర్యాదు మేరకు.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ నటులు హీరో రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సినీ హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. అనన్య నాగళ్ల, సిరి హనుమంతు , శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్ లతో పాటు, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి ,నాయిని పావని, నేహా పతాన్ , పాండు, పద్మావతి ,ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ ,సాయి, భయ్యా సన్నీ , నటి శ్యామల, టేస్టీ తేజ , బండారు శేష సుకృతి , రీతు చౌదరి మొత్తం 25మందిపై 318(4),112r/w,49BNS, 3(3)(A),4TSGA,66D ITA,2000,2008 సెక్షల కింద కేసులు నమోదు చేశారు.