కరోనా మరో టాలీవుడ్ ప్రముఖుణ్ని బలి తీసుకుంది. ఇప్పటికే ఎంతోమందిని బలితీసుకున్న మహమ్మారి తాజాగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్‌ను పొట్టనపెట్టుకుంది. ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడిన ఆయన.. చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయరామ్ స్వస్థలం వరంగల్. 13ఏళ్ల ప్రాయంలో ఇంటి నుండి వెళ్లిపోయిన జయరామ్.. తొలుత ఆంధ్రాక్లబ్‌లో క్యాషియర్ గా పనిచేశారు.
తదనంతరం కెమెరామన్‌గా ఎదిగిన జయరామ్.. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో పనిచేయడంతో పాటు మళయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి అగ్ర హీరోలతో పనిచేశారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో కూడా ఎన్నో సినిమాలకు పనిచేశాడు జయరామ్. ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన జయరామ్.. ఆయనతో మంచికి మరోపేరు, డ్రైవర్ రాముడు, వేటగాడు, సింహబలుడు, మేజర్ చంద్రకాంత్ వంటి ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశారు. జయరామ్ మరణవార్త విన్న ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.