ప్రముఖ బాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఉదయం తన స్టూడియోలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి ఆయన స్టూడియోకు వెళ్లారు. స్టూడియోలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పని చేసిన చిత్రాల్లో 'లగాన్', 'జోథా అక్బర్', 'దేవదాస్' కూడా ఉన్నాయి. హిందీ, మరాఠీ భాషల్లో పలువురు స్టార్ హీరోల సినిమాలకు పని చేశారు. ఆయనకు నాలుగు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆర్ట్ డైరెక్టర్ గానే కాకుండా రెండు సినిమాలకు దర్శకుడిగా, నిర్మాతగా పని చేశారు. నాలుగు సినిమాల్లో నటించారు. 'ఈరోజు ఉదయం శ్రీ నితిన్ దేశాయ్ ఎన్‌డి స్టూడియోస్‌లో ఉరి వేసుకున్నారని గుర్తించాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం' అని పోలీసులు తెలిపారు. దేశాయ్ కోట్లల్లో రుణాన్ని చెల్లించడంలో విఫలమయ్యారని కూడా తెలుస్తోంది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో నితిన్ చంద్రకాంత్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు సెట్స్ వేశారు. బాలీవుడ్ లో ఆయన సలాం బాంబే, 1942 ఏ లవ్ స్టోరీ, హమ్ దిల్ దే చుకే సనమ్, లగాన్, దేవదాస్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, స్లమ్ డాగ్ మిలియనీర్, జోధా అక్బర్ లాంటి ఎన్నో సినిమాలకు పని చేశారు.