రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో అశ్లీలత ఎక్కువైందని పోలీసులకు ఫిర్యాదు అందింది. కొందరు యువకులు పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేశారు. స్టార్ మా ఛానల్, ఇతర OTT ప్లాట్ఫారమ్స్‌లో ప్రసారం అవుతున్న ఈ షోలో అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కంటెంట్ ను వినోదం పేరుతో ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ షో లో పాల్గొనేవారు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం, అనైతిక ప్రవర్తన ప్రదర్శించడం, కుటుంబ, సామాజిక విలువలకు విరుద్దంగా ప్రవర్తించడం వంటి అంశాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఫిర్యాదులో తెలిపారు. ఈ షో భారతీయ సంస్కృతీ విలువలను దెబ్బతీస్తోందని, కుటుంబ సభ్యులు కలిసి చూసే సమయాల్లో ఇలాంటి కంటెంట్ ప్రసారం చేయడం ప్రసార నైతికతలకు విరుద్ధమన్నారు. బిగ్ బాస్ కార్యక్రమం భారతీయ శిక్షాస్మృతి (IPC), సమాచార సాంకేతిక చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ, నిర్మాతలు, ప్రసారకర్తలపై ఎస్ఐఆర్ నమోదు చేయాలని, ఈ సీజన్ను తక్షణమే నిలిపివేయాలని పోలీసులను కోరారు.