ఒకటే ఫ్రేమ్ లో ఇద్దరు చంద్రముఖిలు కనబడితే..!
చంద్రముఖి.. మలయాళంలో 1993లో వచ్చిన మణిచిత్రతాల్ సినిమాను రీమేక్ చేశారు.
By Medi Samrat Published on 9 Oct 2024 3:30 PM GMTచంద్రముఖి.. మలయాళంలో 1993లో వచ్చిన మణిచిత్రతాల్ సినిమాను రీమేక్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించడంతో సినిమాకు ఊహించని పాపులారిటీ దక్షిణాదిన వచ్చింది. దీంతో ఒరిజినల్ కంటే చంద్రముఖి గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. హిందీలో భూల్ భూలయ్యా పేరుతో 2007లో రీమేక్ చేశారు. అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఆ సినిమా సీక్వెల్స్ కోసం హిందీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. మధ్యలో భూల్ భూలయ్యా 2 తో కార్తీక్ ఆర్యన్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మూడో పార్ట్ తో ఈ దీపావళి రోజున సందడి చేయడానికి సిద్ధమయ్యాడు.
భూల్ భూలయ్యా 3 ట్రైలర్ ఎట్టకేలకు వచ్చింది. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ రూహ్ బాబాగా కనిపించాడు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంజూలిక(చంద్రముఖి పాత్ర) లో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించారు. రక్తఘాట్ అనే రాజ్యంలో కథ సాగుతుంది. ఆశ్చర్యకరమైన ట్విస్ట్‌లో ఫ్రాంచైజీ ఇద్దరు మంజులికలను ట్రైలర్ లోనే పరిచయం చేసింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ సినిమాలో కనిపించనున్నారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమాలో రెండు ఆత్మలు ఎలా పోటీ పడతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.