నాగ చైతన్య-వెంకట్ ప్రభు కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతూ ఉంది. ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలో మెల్కోటే గుడి ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ ఉన్న ఈ చారిత్రక దేవాలయంలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కోసమని ప్రసిద్ధ రాయగోపుర దేవాలయ పరిసర ప్రాంతంలో ఓ బార్ కు సంబంధించిన సెట్ వేశారు. దీంతో ఆగ్రహంతో అక్కడి స్థానికులు యూనిట్ పై దాడి చేశారని తెలుస్తోంది. వారసత్వ కట్టడం అయిన రాయగోపురంలో బార్ లాంటి సెట్ వేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని తెలియడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. రాయగోపురం ముందు, పార్టీ సెట్లో వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లతో చిత్రీకరించారు.
సెట్‌ను నిర్మించడానికి భారీ ఇనుప స్తంభాలను ఉపయోగించారు, ఇది రాయగోపురానికి నష్టం కలిగించింది. దీంతో చిత్ర బృందంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల చిత్రీకరణకు మాండ్య డిసి అశ్వతి షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఆ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బార్ సెట్ నిర్మించి శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని అవమానించారని నాగ చైతన్య సినిమా యూనిట్ పై మండిపడినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన మనోభావాలను దెబ్బ తీస్తూ చిత్రీకరణ చేసారని, తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. గతంలో పలు సినిమాల షూటింగ్ సమయంలో కూడా ఇక్కడి వాతావరణాన్ని దెబ్బతీస్తూ వస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పించారు. ఇకపై ఇక్కడ ఎటువంటి షూటింగ్ లకు అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు.