హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 24వ వార్షికోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కురిపించారు. సీఎం రేవంత్ రెడ్డి అందరికి రోల్ మోడల్ అని బాలకృష్ణ కొనియాడారు. ఆసుపత్రి సేవల విస్తరణకు సహకరించాలని కోరగా, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించారని అన్నారు.
నందమూరి బాలకృష్ణ తన ప్రసంగంలో పెరుగుతున్న క్యాన్సర్ మహమ్మారిపై ఆందోళనను వ్యక్తం చేశారు. ఆసుపత్రిని స్థాపించడంలో మాజీ సిఎం ఎన్‌టి రామారావు దూరదృష్టి గల నాయకత్వాన్ని కొనియాడారు. గతంలో రాళ్లతో నిండిన ప్రాంతంలో ఆసుపత్రిని నిర్మించారని, ప్రస్తుతం రోగులకు అద్భుతమైన సేవలు అందిస్తున్నామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన కృషిని కూడా బాలకృష్ణ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిని అభివృద్ధి చేసి ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తున్న విషయాన్ని బాలకృష్ణ ప్రస్తావించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కేటాయించిన స్థలంతో ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం ఆస్పత్రిని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు చైర్మన్‌గా పనిచేసే అవకాశం రావడం పట్ల బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.