ఈరోజే 'అయలాన్' విడుదల అన్నారు.. షోలు క్యాన్సిల్

శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో పొంగల్ కు రిలీజ్ అయిన సినిమా 'అయలాన్'. అదే పేరుతో తెలుగులో ఈ సినిమాను నేడు విడుదల చేయాలని అనుకున్నారు

By Medi Samrat  Published on  26 Jan 2024 2:15 PM GMT
ఈరోజే అయలాన్ విడుదల అన్నారు.. షోలు క్యాన్సిల్

శివ కార్తికేయన్ హీరోగా తమిళంలో పొంగల్ కు రిలీజ్ అయిన సినిమా 'అయలాన్'. అదే పేరుతో తెలుగులో ఈ సినిమాను నేడు విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన సినిమా షోలు రద్దయ్యాయి. అయాలాన్ తెలుగు విడుదల ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటోంది. రవి కుమార్ దర్శకత్వం వహించిన అయాలాన్ తమిళనాడులో బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది.

తొలిరోజు తెలుగులో విడుదల అవ్వకపోవడం ఈ సినిమాకు భారీ ఎదురుదెబ్బ. హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలలో తెలుగు వెర్షన్ మార్నింగ్ షోలు ఒక్కసారిగా రద్దు చేశారు. దీంతో సినీ ప్రేమికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇలా అయాలాన్ షోలు రద్దు కావడానికి కొన్ని చట్టపరమైన సమస్యలే కారణమని తెలుస్తోంది. అయితే తెలుగు డిస్ట్రిబ్యూషన్ కు ఎలాంటి సమస్య లేదని తెలుస్తోంది. జనవరి 26న బ్యాంకులు, కోర్టులు మూసివేసి ఉండడంతో తమిళ నిర్మాతలు కొన్ని చట్టపరమైన సమస్యలను క్రమబద్ధీకరించలేకపోయారు. దీంతో ఈరోజు చాలా ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలవ్వలేదు. శివకార్తికేయన్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. అలాంటిది ఈరోజు సినిమా విడుదలవ్వకపోవడంతో థియేటర్లకు వెళ్లిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఈ స‌మ‌స్య‌ను ఎప్ప‌డు ప‌రిష్క‌రించి సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. అయాలాన్‌కు అకాడమీ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందించారు.

Next Story