"షారుఖ్ ఖాన్ ఎవరు? నాకు అతని గురించి లేదా పఠాన్ చిత్రం గురించి ఏమీ తెలియదు" అని.. శనివారం నాడు విలేకరులు అడిగిన ప్రశ్నలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఇచ్చిన సమాధానం. శుక్రవారం నగరంలోని నారేంగిలో సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్‌పై దాడి చేసి, పోస్టర్లను చింపి, దగ్ధం చేశారు భజరంగ్ దళ్ కార్యకర్తలు. ఈ హింసాత్మక నిరసనలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనలపై షారుఖ్ ఖాన్ నాకు ఫోన్ చేయలేదు.. ఒకవేల చేస్తే మాత్రం స్పందిస్తామని అన్నారు. ”రకరకాల సమస్యల గురించి బాలీవుడ్ నుంచి చాలా మంది ఫోన్ చేసినా ఈ ఖాన్ నాకు ఫోన్ చేయలేదు. కానీ అతను చేస్తే, అప్పుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను’’ అని అన్నారు. శాంతి భద్రతలను మేము కాపాడుతామని హిమంత బిస్వా శర్మ చెప్పుకొచ్చారు.
షారుఖ్ ఖాన్ చిత్రం 'పఠాన్' జనవరి 25న విడుదల కాబోతోంది. ఆ సినిమాలోని 'బేషరమ్ రంగ్' పాట తీవ్ర వివాదాస్పదమైంది. పలువురు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పఠాన్' భారీగా దేశ వ్యాప్తంగా విడుదల అవుతోంది.